Poples Voice
Date of Publish : 24/10/2026, 6:57 pm
Published by PEOPLES VOICE

రహదారుల విస్తరణకు భారీ నిధులు.. చింతకాని మండలంలో అభివృద్ధి పనుల జోరు

  • రహదారుల విస్తరణకు భారీ నిధులు.. చింతకాని మండలంలో అభివృద్ధి పనుల జోరు
  • రూ.125.83 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రహదారుల విస్తరణకు భారీ నిధులు.. చింతకాని మండలంలో అభివృద్ధి పనుల జోరు

రూ.125.83 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

చింతకాని, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్):

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో శనివారం రూ.125.83 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పూర్తయిన సీసీ రోడ్లను ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డితో కలిసి మండలంలో పర్యటించిన డిప్యూటీ సీఎం.. పొద్దుటూరు గ్రామంలో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. తిమ్మినేనిపాలెంలో రూ.8.25 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి, రామకృష్ణాపురం నుంచి కొత్తగూడెం మీదుగా దేవరపల్లి హైవేను కలిపే రహదారికి రూ.3 కోట్లతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు.

రామకృష్ణాపురం నుంచి పెద్దగోపతి రోడ్డు వరకు రూ.50 కోట్లతో రహదారి విస్తరణ, బలోపేతం పనులకు, కొదుమూరు గ్రామంలో వెంకటపాలెం నుంచి చింతకాని రోడ్డు వరకు రూ.60 కోట్లతో నాలుగు వరుసల రహదారి విస్తరణ, బలోపేతం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ఐదు పనుల అంచనా వ్యయం రూ.124.75 కోట్లు.

తిమ్మినేనిపాలెం ఎస్సీ కాలనీలో రూ.62 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను, గాంధీనగర్‌ ఎస్సీ కాలనీలో రూ.46 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ రెండు పనుల వ్యయం రూ.1.08 కోట్లు. దీంతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన పనుల మొత్తం విలువ రూ.125.83 కోట్లుగా ఉంది.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. కొత్త సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు వాటి ప్రయోజనాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో మధిర మాజీ ఎమ్మెల్యే కొండభాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంబటి వెంకటేశ్వరరావు, కొదుమూరు శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌ వేముల సతీష్‌, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save