రేకుల ఇళ్లలో రెక్కల కష్టం.. పాములు, తేళ్ల మధ్య పేదల బతుకులు! ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్పంచ్ వినతి
చింతకాని, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):
మండలంలోని తిరుమలాపురం గ్రామంలో నిరుపేద కుటుంబాల నివాస కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సరైన పక్కా ఇళ్లు లేక రేకుల ఇళ్లలోనే జీవనం సాగిస్తున్న పేదలపై ఇటీవల ప్రకృతి ప్రకోపం పిడుగులా పడింది. భారీ ఈదురుగాలులు, అకాల వర్షాల కారణంగా రేకుల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి నివాసాలు దెబ్బతిన్నాయని గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో బుధవారం ఉపసర్పంచ్ గోగుల నాగమణి, గ్రామ నాయకుడు గోగుల నరసింహారావుతో కలిసి చింతకాని ఎంపీడీవో చుంచు శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు.
పాములు, తేళ్ల భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం
ఈ సందర్భంగా సర్పంచ్ వీరబాబు మాట్లాడుతూ.. వర్షాలు కురిసినప్పుడు ఇళ్లలోకి నీరు చేరుతోందని, రాత్రివేళల్లో పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తుండటంతో నిరుపేద కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయని తెలిపారు. చిన్నపిల్లలతో కూడిన కుటుంబాలు రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇళ్లలో నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రభుత్వం అమలు చేయనున్న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత కల్పించి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత కుటుంబాల నివాస పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే రూపొందించిన లబ్ధిదారుల జాబితాల్లో అనర్హులు ఉంటే వారిని తొలగించి, గ్రామసభ నిర్వహించి పారదర్శకంగా నిజమైన అర్హులైన నిరుపేదలను గుర్తించాలని కోరారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా న్యాయం జరిగేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సర్పంచ్ వీరబాబు ఎంపీడీవోను కోరారు.