హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు కొట్టాడనే ఆరోపణ.. పదో తరగతి విద్యార్థి మృతి
తండ్రికి ఫోన్ చేసి హాస్టల్లో ఉండలేకపోతున్నానని ఆవేదన.. వర్గల్ బీసీ వసతి గృహంలో విషాదం
సిద్దిపేట, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):
సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయుడు కొట్టాడని ఆరోపిస్తూ, మనస్తాపానికి గురైన పదో తరగతి విద్యార్థి రామ్ చరణ్ (15) మృతి చెందాడు.మార్కుక్ మండలం పోతూర్ గ్రామానికి చెందిన రామ్ చరణ్ వర్గల్ మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో ఉపాధ్యాయుడు కొట్టాడని, హాస్టల్లో ఉండలేకపోతున్నానని బాలుడు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో వసతి గృహంలో ఎవరూ లేని సమయంలో బాలుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఘటనను గుర్తించిన సిబ్బంది బాలుడిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు సమాచారం.
చిన్న వయసులోనే బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.