ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం!
తెలంగాణలో IUMLను బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతాం
ఖమ్మంలో మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ మహమ్మద్ షకీల్
ఖమ్మం, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):
ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ మహమ్మద్ షకీల్ స్పష్టం చేశారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదిరితే కలిసి పనిచేస్తామని, లేనిపక్షంలో పార్టీ తరఫున సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో IUMLను బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఖమ్మం నగరంలోని రెస్టిన్ హోటల్‌లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. బాజీబాబా నేతృత్వంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ మాట్లాడుతూ ప్రజల హక్కుల సాధన కోసం, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సాధించడం, విద్యా, వైద్య రంగాల్లో పేదలకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం తమ పార్టీ ప్రధాన కార్యాచరణలో భాగమని వివరించారు. ప్రజా సమస్యలపై ఎలాంటి రాజీ లేకుండా పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మతసామరస్యం, సోదరభావం, సామాజిక సమానత్వం బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధానాలకు తావులేకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు సాగుతామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. బాజీబాబా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పార్టీ విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి చీమకుర్తి బ్రహ్మచారి, ఆటో యూనియన్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ హనీఫ్, జిల్లా కోశాధికారి సర్వర్ పాషా, ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షురాలు ఫర్హీన సుల్తానా, హరి బహదూర్, బి. రాజు, మహిళా అధ్యక్షురాలు షేక్ జరీనా, రాష్ట్ర నాయకులు, ఇతర పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.