Poples Voice
Date of Publish : 28/11/2026, 9:11 pm
Published by PEOPLES VOICE

పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి_షేక్ బషీరుద్దీన్

పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

విద్య, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం

– సీఐటీయూ జిల్లా నాయకులు షేక్ బషీరుద్దీన్

తిరుమలాయపాలెం, నవంబర్ 28 (పీపుల్స్ వాయిస్):

అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో, అంటరానితనం, కుల వివక్ష, మూఢనమ్మకాలపై పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని సీఐటీయూ జిల్లా నాయకులు షేక్ బషీరుద్దీన్ అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

స్థానిక గజ్జల వెంకటయ్య భవనంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సభకు వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ నాయకులు దాసరి మహేందర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షేక్ బషీరుద్దీన్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1890 నవంబర్ 28న జ్యోతిరావు పూలే మరణించారని, నేటికీ ఆయన ఆశయాలను స్మరించుకోవడం సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. అందరికీ విద్య అందించాలనే సంకల్పంతో తన జీవితాన్ని అంకితం చేసిన పూలే, తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. అంటరానితనం, కుల వ్యవస్థ, సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలపై ఆయన సాగించిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సైతం జ్యోతిరావు పూలే ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందారని పేర్కొన్నారు.విద్య, సమానత్వం, సామాజిక న్యాయం సాధించినప్పుడే పూలేకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పీఎన్‌ఎం డివిజన్ కార్యదర్శి నందిగామ కృష్ణ, పీఎన్‌ఎం మండల కార్యదర్శి ఉపేందర్, సీఐటీయూ మండల కన్వీనర్ వశపంగు వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నెరుసుల వెంకటేశ్వర్లు, నాయకులు కొమ్ము నాగేశ్వరరావు, సుజాత, వెంకన్న, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save