Poples Voice
Date of Publish : 20/10/2026, 10:15 pm
Published by Yakub Pasha

ఖమ్మంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో వీరంగం.. బాటిళ్లు ధ్వంసం, మేనేజర్‌పై దాడి

  • ఖమ్మంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో వీరంగం.. బాటిళ్లు ధ్వంసం, మేనేజర్‌పై దాడి
  • సెల్‌ఫోన్‌ అపహరణ.. ఖానాపురం హవేలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

ఖమ్మంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో వీరంగం.. బాటిళ్లు ధ్వంసం, మేనేజర్‌పై దాడి

సెల్‌ఫోన్‌ అపహరణ.. ఖానాపురం హవేలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

ఖమ్మం, అక్టోబర్ 20 (పీపుల్స్ వాయిస్): ఖమ్మం నగరంలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో జరిగిన ఘర్షణలో బీర్‌, కూల్‌డ్రింక్స్‌ బాటిళ్లు ధ్వంసం కావడంతో పాటు మేనేజర్‌పై దాడి చేసి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లిన ఘటనపై ఖానాపురం హవేలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్‌ 20న ఖమ్మం నగరంలోని శ్రీనగర్‌ కాలనీ, రోడ్‌ నంబర్‌ 3లో ఉన్న ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తున్న సమయంలో నీళ్ల విషయమై సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గొడవను సద్దుమణిగించేందుకు బార్‌ మేనేజర్‌ శీలం వెంకట్రామిరెడ్డి ప్రయత్నించగా, వారు ఫోన్‌ చేసి మరికొందరిని అక్కడికి పిలిపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

TS 04 D 9375 నంబర్‌ గల నల్లరంగు మహీంద్రా థార్‌ రాక్స్‌ వాహనంలో అక్కడికి చేరుకున్న వారు బార్‌లోకి ప్రవేశించి బీర్‌, కూల్‌డ్రింక్స్‌ బాటిళ్లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో సుమారు రూ.5,000 విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. అనంతరం మేనేజర్‌, సిబ్బందిని దూషిస్తూ మేనేజర్‌పై చేతులతో దాడి చేసి చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో మేనేజర్‌కు చెందిన సుమారు రూ.30,000 విలువైన సెల్‌ఫోన్‌ కింద పడిపోగా, దానిని నిందితులు తీసుకెళ్లినట్లు ఆరోపించారు. అక్కడి నుంచి వెళ్లే సమయంలో బార్‌ ముందు పార్క్‌ చేసిన మరో కారును తమ వాహనంతో ఢీకొట్టి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో తెలిపారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఖానాపురం హవేలి పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 583/2026గా కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు వెల్లడించారు. ఫిర్యాదులో కే. జ్ఞానేశ్వర్‌, బొడ్డు వరుణ్‌ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లు ఉన్నాయని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save