గ్రామాల్లో కోరలు చాస్తున్న కుల వివక్ష!

- గ్రామాల్లో కోరలు చాస్తున్న కుల వివక్ష!
- దుర్గామాత ఊరేగింపులో దళిత యువకుడిపై దాడి జరిగినట్లు ఆరోపణలు
- యువకుడిని కాపాడిన యాదవులు.. గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన!
గ్రామాల్లో కోరలు చాస్తున్న కుల వివక్ష!
దుర్గామాత ఊరేగింపులో దళిత యువకుడిపై దాడి జరిగినట్లు ఆరోపణలు
యువకుడిని కాపాడిన యాదవులు.. గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన!
బోనకల్, అక్టోబర్ 21 (పీపుల్స్ వాయిస్): గ్రామాల్లో కుల వివక్ష ఇంకా కొనసాగుతుందా? భక్తితో జరిగే మతపరమైన వేడుకల్లోనూ కులం పేరుతో అవమానాలు, దాడులు చోటుచేసుకుంటున్నాయా? అనే ప్రశ్నలు బోనకల్ మండల పరిధిలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న ఓ ఘటనతో చర్చనీయాంశంగా మారాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బోనకల్ మండల పరిధిలోని సిరిపురం పొలిమేరలో ఉన్న ఓ గ్రామంలో మంగళవారం రాత్రి దుర్గామాత ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. హిందూ మతానికి చెందిన ఓ దళిత యువకుడు భక్తితో ఊరేగింపులో పాల్గొన్నట్లు సమాచారం.
వేడుకల్లో సరదాగా నృత్యం చేస్తున్న క్రమంలో సదరు యువకుడు ఇతరులకు తగలడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు కులం పేరుతో దూషిస్తూ యువకుడిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యువకుడిపై దాడి జరుగుతుండగా స్థానిక యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు జోక్యం చేసుకుని అతడిని అక్కడి నుంచి కాపాడినట్లు సమాచారం. అయితే, యువకుడిని అక్కడి నుంచి తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారితోనూ కొందరు ఘర్షణకు దిగినట్లు తెలిసింది.
ఈ ఘటన విషయం స్థానిక దళిత కాలనీలోని యువకులకు తెలియడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం. సుమారు 20 మంది యువకులు అర్ధరాత్రి వరకు ప్రతిఘటనకు సిద్ధమైనట్లు, ఊరేగింపు తిరిగి వస్తే ఎదుర్కోవాలనే ఆగ్రహంతో ఉన్నట్లు స్థానిక వర్గాల ద్వారా తెలిసింది. విషయం గ్రామ పెద్దల దృష్టికి వెళ్లడంతో వారు ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
భక్తి వేడుకల్లో కుల వివక్షకు తావెక్కడ?
దుర్గామాత వేడుకలు భక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలవాల్సి ఉండగా.. కులం పేరుతో దూషణలు, దాడులు జరిగాయనే ఆరోపణలు గ్రామంలో చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు, బాధ్యులెవరనే అంశాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
గ్రామంలో కులాల మధ్య విభేదాలు మరింత పెరగకుండా పెద్దలు, సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై పోలీసుల స్పందన, బాధితుడి ఫిర్యాదు, తదుపరి చర్యల వివరాలు తెలియాల్సి ఉంది.
దుర్గామాత సాక్షిగా జరిగిన వేడుకల్లో కుల వివక్షకు సంబంధించిన ఆరోపణలు నిజమేనా? బాధ్యులపై చర్యలు ఉంటాయా? గ్రామంలో శాంతి నెలకొంటుందా? అన్న ప్రశ్నలకు అధికారిక విచారణతోనే స్పష్టత రానుంది.
ఇదీ చదవండి :: దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క











