మురసు తుఫాన్ బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి_సి.వై. పుల్లయ్య డిమాండ్

మురసు తుఫాన్ బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి
– సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సి.వై. పుల్లయ్య డిమాండ్
ఖమ్మం, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మురసు తుఫాన్ కారణంగా మొక్కజొన్న, పత్తి, మిర్చి, వరి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సి.వై. పుల్లయ్య డిమాండ్ చేశారు.ఈ ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారని, తాజాగా మురసు తుఫాన్ ప్రభావంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు నీట మునిగి మరింత నష్టాన్ని చవిచూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో పత్తి నల్లబడిపోగా, వరి పంటలు మొలకెత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.మిర్చి సాగుకు ఎకరాకు సుమారు రూ.80 వేల వరకు, ఇతర పంటలకు కూడా భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు అకాల వర్షాలు, తుఫాన్లతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని, నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి ఎకరాకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం వెంటనే అందించాలని సి.వై. పుల్లయ్య డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని












